Monday, January 14, 2008

సమాచార హక్కు దుర్వినియోగం

సమాచార హక్కు చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, శిక్షలకు సంబంధించిన నిబంధనలను చేరుస్తూ ఈ చట్టాన్ని సవరించాల్సి ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) అభిప్రాయపడింది. ' ఈ చట్టాన్ని దుర్వినియోగ ఉద్దేశంతో సమాచారం కోరే వారిని శిక్షించే చర్యలు తీసుకోడానికి వీలుగా ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరాన్ని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి' అని కమిషన్‌ పేర్కొంటూ నవోదయ విద్యాలయకు చెందిన ఓ ఉపాధ్యాయుని దరఖాస్తును కొట్టివేసింది.
కేవలం ఆ బడిపై అక్కసు తీర్చుకోవడం కోసమే ఈ దరఖాస్తును ఆయుధంగా వాడుకోవాలని పిటిషనర్లు రమేశ్‌చంద్ర, ఆయన భార్య ఉమాకుమారి విశ్వప్రయత్నం చేసినట్టుగా కమిషన్‌ నిర్ధారించింది. రమేశ్‌ చంద్రను బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ దంపతులు తొలుత కేంద్ర పాలనా వ్యవహారాల ట్రిబ్యునల్‌ (సీఏటీ)ని ఆశ్రయించగా చుక్కెదురైంది. తరువాత హైకోర్టులోనూ, అనంతరం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌లోనూ అదే పరిస్థితి. చిట్టచివరగా ఆర్టీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఇదంతా గమనించిన సమాచార కమిషనర్‌ ఓపీ కేజారీవాల్‌ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Labels:

పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే పారితోషికం

మనం పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే డబ్బులు చెల్లించడం ఎక్కడైనా ఉన్నదే. కానీ, వాడినందుకు మనకే డబ్బులిస్తోంది ఒక సంస్థ. ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి మరీ నెలవారీ చెల్లింపులు చేస్తోంది. తిరుచిరాపల్లి (కేరళ) సమీపంలోని ముసిరికి చెందిన సొసైటీ ఫర్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ అలా చేస్తోంది! ఎరువుగా మలమూత్రాల వాడకంపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సుబ్బరామన్‌ చెప్పారు.

Labels:

వైద్యులు, ఆస్పత్రులు నిబంధనలను పాటించాలి

జాతీయ వైద్యమండలి నిబంధనలను రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ వల్లభనేని రాంప్రసాద్‌ కోరారు. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన ఇరువురి వైద్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుడు వి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యాయని తెలిపారు. తిరుపతికి చెందిన వైద్యుడు ఎం.శ్రీనివాసరావు కూడా నిబంధనలను ఉల్లంఘించినందున వీరిరువురి రిజిస్ట్రేషన్లు ఏడాది పాటు రద్దు చేస్తున్నామని చెప్పారు. ''వివిధ రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేస్తామంటూ కొందరు వైద్యులు పత్రికలు, కరపత్రాల ద్వారా జారీచేస్తున్న ప్రకటనలు వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇకపై వైద్యులు, ఆస్పత్రులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు నైతిక విధానాలను అనుసరించాలి'' అని కోరారు.

Labels:

స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా

సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే స్మార్టుకార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు ఏటా సుమారు రూ.18 కోట్లు ఆదా చేయవచ్చని అధికారుల అంచనా . ప్రస్తుతం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఆరు జిల్లాల్లో, వచ్చే డిసెంబర్‌ నాటికి రాష్ట్రమంతటా వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇందుకు 13 బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. మౌలిక వసతులను బ్యాంకులు సమకూర్చనున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్మార్టుకార్డుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది. అనంతరం తొలుత సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల్లో ఎంపికజేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి మూడోవారానికల్లా ముగించి లబ్ధిదారులకు స్మార్టుకార్డులను పంపిణీ చేస్తారు. తొలివిడతగా వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ నుంచి స్మార్టుకార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.