ప్రజల అవసరాల మేరకు నాణ్యమైన సేవలను, నిర్ణీత కాల వ్యవధిలో సేవా సంస్థలు అందించేలా చేసే లక్ష్యంతో ప్రారంభమైనవే 'సిటిజన్ ఛార్టర్లు' (పౌరుల అధికార పత్రాలు). 'ప్రజల కొరకే ప్రభుత్వం' పనిచేసేలా చూస్తూ పౌరులకు మరింత బలాన్ని చేకూర్చటమే ఈ సిటిజన్ ఛార్టర్ల ప్రధాన లక్ష్యం. అత్యధిక ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తు ప్రజలకు సన్నిహితంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేలా చూసేందుకు అటు ప్రభుత్వం వైపు నుంచి గానీ, ఇటు ప్రజా సంఘాల నుంచి గానీ స్పష్టమైన ప్రయత్నాలు చాలా కాలం పాటు జరగలేదు. దాంతో ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీగా ఉండటం మరుగున పడిపోయాయి. వీటన్నిటికీ తోడు ప్రభుత్వ విధాన నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ప్రజలకు లేకుండా పోతోంది. ఈ కారణాలన్నిటి వల్లా మరింత ఉత్తమమైన, నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే ప్రభుత్వం కావాలని డిమాండ్ చేసే శక్తీ సమాచారమూ చొరవా ప్రజల్లో ఉండటం లేదు.
ఇప్పటి వరకు 'ఇచ్చే వారే ప్రజల నెత్తిన రుద్దేవారుగా' కొనసాగుతున్నారు. అయితే ఇపుడు పొందటమనేది వినియోగదారుల హక్కుగా మారిందని పౌరుల అధికార పత్రం నొక్కి చెబుతుంది. ఇది వివిధ రకాల వస్తు సేవలను అందించే ప్రైవేట్ సంస్థలకే కాక ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ప్రభుత్వానికి కస్టమర్లు ప్రజలే. ప్రభుత్వం ప్రజల కొరకే ఉందనీ, ప్రభుత్వానికి ప్రజలు వాడకందార్లనీ, వారికి నాణ్యమైన, సమర్థవంతమైన సేవలను అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందనీ గుర్తుంచుకోవాలి.
ప్రతి పౌరుడూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్నులను చెల్లిస్తున్నాడు. ప్రజలు పొందే ఏ సేవా ఉచితంగా రావటం లేదు. కనుక వారి అవసరాల మేరకు ప్రశస్తమైన, నాణ్యమైన సేవలను సరసమైన ధరలో పొందే హక్కు వారికి ఉంది. ఈ హక్కును సాధించుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం పని తీరులో సమూలాగ్రమైన మార్పు రావాలి. ప్రజలూ ప్రజా సంఘాలూ ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలో, వాటి అమలులో చురుకుగా పాల్గొనాలి. ఈ అంశాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంస్థకూ సంబంధించి కనీస ప్రమాణాలను నిర్థారించి, ఎప్పటికప్పుడు ఆయా సంస్థల పని తీరును సమీక్షించి తగు మార్పులు, చేర్పులు చేపట్టే లక్ష్యంతో సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.
దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలకు కూడా అవి అందించే సేవలు, ఆ సేవలను పొందే విధానం, సేవలను అందించేందుకు పట్టే కాల వ్యవధి తదితర వివరాలతో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించటం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో 2.10.2002వ తేదీన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా, గ్రామ సభ నిర్వహణతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలోను ఒక పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించవలసిందిగా కోరటమైంది. పౌరసేవా కేంద్రం బాధ్యతలను గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరికి అప్పగించవలసిందిగా సూచించటం జరిగింది.
గ్రామ పంచాయతీ అందించే సేవలు, వాటిని పొందేందుకు పట్టే కాల పరిమితి వివరాలతో కూడిన నమూనా సిటిజన్ ఛార్టర్ను ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా, కొద్ది పాటి మార్పులతో ఈ నమూనాను గ్రామ సభ ముందు ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పంచాయతీ పొందాలి.
గ్రామ పంచాయతీ సేవలను కోరే పౌరులు అవసరమైన ఆధారాలను జత చేస్తూ దరఖాస్తును గ్రామ పంచాయతీలోని పౌర సేవా కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు అందజేయాలి. స్థానిక పరిస్థితులను బట్టి, ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఈ సమయాన్ని గ్రామ పంచాయతీ మార్చుకోవచ్చు. పౌర సేవా కేంద్రం నిర్వహణకు బాధ్యత వహిస్తున్న వ్యక్తి దరఖాస్తు అందినట్లు తెలుపుతూ తేదీ, సమయం పేర్కొంటూ రశీదును జారీ చేయాలి. నిర్దేశించిన సమయం తర్వాత పౌరులు తాము ఆశిస్తున్న అనుమతి/ధృవీకరణ పత్రం/సేవను పౌర సేవా కేంద్రం నుంచి పొందవచ్చు. సాధారణంగా ప్రతి రోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అనుమతులు/ధృవీకరణ పత్రాలు/లైసెన్సులను జారీ చేయటం జరుగుతుంది.
దరఖాస్తులను స్వీకరించే సమయం లోనే పౌరుడు పూర్తి వివరాలను పొందుపరిచేట్లు గ్రామ పంచాయతీ సహాయం అందించాలి. నిర్దేశించిన కాల పరిమితి లోపు దరఖాస్తుదారునికి సేవ/ధృవీకరణ పత్రం/లైసెన్సును గ్రామ పంచాయతీ ఇవ్వలేకపోతే, ఆలస్యమైన రోజుకు పది రూపాయల చొప్పున టోకెన్ నష్ట పరిహారాన్ని దరఖాస్తుదారునికి గ్రామ పంచాయతీ నిధి నుంచి చెల్లించాలి. ఆ పరిహారాన్ని తర్వాత సంబంధిత ఆలస్యానికి కారణమైన ఉద్యోగి జీతం నుంచి మినహాయించాలి.
గ్రామ పంచాయతీల్లో పనుల కాల వ్యవధిధృవీకరణ పత్రాల జారీ కాల పరిమితి
స్వగ్రామ (నేటివిటీ) ధృవీకరణ పత్రం జారీ 2 రోజులు
నివాస ధృవీకరణ పత్రం జారీ 2 రోజులు
కుల ధృవీకరణ పత్రం జారీకి సిఫారసు 2 రోజులు
ఆదాయ ధృవీకరణ పత్రం జారీకి సిఫారసు 2 రోజులు
జనన మరణ ధృవీకరణ పత్రం జారీ 5 రోజులు
రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కాల పరిమితి
జనన మరణాల రిజిస్ట్రేషన్ 3 రోజులు
ఆస్తి పన్ను గణన, ఇంటి నెంబరు కేటాయింపు 15 రోజులు
భవన నిర్మాణ దరఖాస్తుల పరిష్కారం 15 రోజులు
నీటి సరఫరా మంజూరు 30 రోజులు
ఆస్తి బదిలీ (మ్యుటేషన్) 15 రోజులు
లైసెన్సుల జారీ 5 రోజులు
పహణి/అడంగల్ ఎక్స్ట్రాక్ట్ 2 రోజులు
సమస్యల తొలగింపు కాల పరిమితి
పైపులైన్ లీకేజీల మరమ్మత్తు 24 గంటలు
చేతి పంపుల మరమ్మత్తులు 3 రోజులు
వీధి దీపాల్లో బల్బులు, ట్యూబుల రీప్లేస్మెంట్ 2 రోజులు
నిలిచిపోయిన మురుగు కాల్వలు 2 రోజులు
రోడ్డు కోతలు, గుంతలు 3 రోజులు
చెత్త కుండీల శుభ్రతపై ఫిర్యాదులు 2 రోజులు
పంచాయతీ/ప్రభుత్వానికి ఎవరైనా వ్యక్తి
చెల్లించాల్సిన బకాయిల వివరాలు 5 రోజులు
పంచాయతీల్లో సిటిజన్ ఛార్టర్ల అమలు నిరాశాజనకం
కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యయనం వెల్లడి
పంచాయతీల్లో సిటిజన్ ఛార్టర్ల అమలు తీరుపై కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ 2004-05 సంవత్సరంలో ఒక అధ్యయనం చేసింది. విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల లోని కొన్ని ఎంపిక చేసిన మండలాల లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సిటిజన్ ఛార్టర్ల విషయమై ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకొనే లక్ష్యంతో ఒక సర్వే చేసింది.
నిర్దేశించిన కాల పరిమితి లోపు దరఖాస్తుదారునికి సేవ/ధృవీకరణ పత్రం/లైసెన్సును గ్రామ పంచాయతీ ఇవ్వలేకపోతే, ఆలస్యమైన రోజుకు పది రూపాయల చొప్పున టోకెన్ నష్ట పరిహారాన్ని దరఖాస్తుదారునికి గ్రామ పంచాయతీ నిధి నుంచి చెల్లించాలనే విషయం సిటిజన్ ఛార్టర్లలో ఉన్నట్లు ఏ ఒక్క పంచాయతీ కార్యదర్శికీ తెలియదని ఈ సర్వేలో వెల్లడైంది. ఆ పరిహారాన్ని తర్వాత సంబంధిత ఆలస్యానికి కారణమైన ఉద్యోగి జీతం నుంచి మినహాయించాలనే విషయం ఎవరికీ తెలియదు. సిటిజన్ ఛార్టర్ నమూనాను గ్రామ సభలో ప్రవేశపెట్టి, సిటిజన్ ఛార్టర్ గురించి ప్రజలందరికీ తెలియజేసి, గ్రామ సభ నిర్ణయం మేరకు దానిలో మార్పులు చేయటం అనేది ఏ గ్రామ పంచాయతీ లోను జరగలేదని ఈ సర్వేలో వెల్లడైంది.
ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించిన కొన్ని సంస్థలు :
- ఎ.పి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
- ఎ.పి. ఫైర్ సర్వీసెస్
- ఎ.పి. ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్
- ఎ.పి. ట్రాన్స్కో/ డిస్కమ్
- ఎ.పి. హౌసింగ్ బోర్డు
- ఎ.పి. హౌసింగ్ కార్పొరేషన్
- ఎ.పి. హౌసింగ్ ఫెడరేషన్
- ఎ.పి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
- ఎ.పి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- ఎ.పి. పోలీస్
- ఎ.పి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ
- ఎ.పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
- బి.సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్
- బోర్డ్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్
- బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
- బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
- బాయిలర్స్ డిపార్ట్మెంట్
- ఛీఫ్ ఇంజనీర్స్, నేషనల్ హైవేస్
- సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్
- కమీషనరేట్ ఆఫ్ టెండర్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
- డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ
- డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
- డిపార్ట్మెంట్ ఆఫ్ హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్
- డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ
- డిపార్ట్మెంట్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్, లాటరీస్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్
- డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
- ఇఎస్ఐ హాస్పటల్స్
- గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్
- జవహర్ బాల భవన్
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
- మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్
- పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
- ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ డిపార్ట్మెంట్
- స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
- స్టేట్ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- తెలుగు అకాడమీ
- డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (హోమియోపతి, ఆయుర్వేదిక్ హాస్పటల్స్)
- దాదాపు జాతీయ బ్యాంకులన్నీ కూడా సిటిజన్ ఛార్టర్స్ను ప్రకటించాయి.
Labels: consumer rights