Monday, December 22, 2008

వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Labels:

సమాచారం అందడంలేదు!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

Labels:

రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.

Labels:

Monday, April 14, 2008

బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం

బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.

Labels: ,

Thursday, March 6, 2008

498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని  అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.